సంపద సృష్టించడం నేరం కాదు
బీజేపీ నేత గౌరవ్ వల్లభ్ కామెంట్స్
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి ఇటీవలే బీజేపీలోకి జంప్ అయిన గౌరవ్ వల్లభ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ తాను ఎందుకు మారాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆదివారం గౌరవ్ వల్లభ్ మీడియాతో మాట్లాడారు.
సనాతన ధర్మం గురించి, ప్రత్యేకించి వ్యాపారవేత్తల గురించి పదే పదే కాంగ్రెస్ పార్టీ మూసకట్టు ధోరణితో విమర్శలు చేస్తోందని, దానిని పక్కన పెట్టాలని తాను చాలాసార్లు సూచించానని అన్నారు. కానీ తన మాటలను పట్టించు కోలేదని, పెడ చెవిన పెట్టారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ గాడి తప్పిన నావ లాగా తయారైందని, అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదన్నారు. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అసలు సంపద సృష్టించడం నేరం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు.
అదానీ గురించి తాము పదే పదే ప్రస్తావిస్తూ వచ్చామని, సెబీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిందని , ఆ తర్వాత తాము వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదన్నారు గౌరవ్ వల్లభ్. మొత్తంగా అయోధ్య రాముడి ఆలయానికి ఎందుకు వెళ్ల కూడదని తాను నిలదీశానని అందుకే అక్కడ ఉండలేక వచ్చేశానని చెప్పారు .