అబద్దాల జాతర హామీల పాతర
కాంగ్రెస్ మేనిఫెస్టో బక్వాస్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించిన జన జాతరపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. అది జన జాతర కాదని అబద్దాల జాతర అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పాతరేశారంటూ మండిపడ్డారు కేటీఆర్.
రాహుల్ గాంధీ ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీల పేరుతో గారడీ చేశాడని, ఓట్లు దండుకునే ప్రయత్నం చేశాడంటూ ఆరోపించారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో న్యాయ్ పేరుతో నయా నాటకానికి తెర తీశారంటూ ధ్వజమెత్తారు.
నమ్మి ఓటేసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను గత నాలుగు నెలలుగా నయవంచన చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ అంటూ మండిపడ్డారు కేటీఆర్. అసత్యాలతో అధికారంలోకి వచ్చి..అన్నదాతలను ఆత్మహత్యల పాల్జేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యారెంటీలకు పాతరేసి… అసత్యాలతో జాతర చేస్తోందని సీరియస్ అయ్యారు . ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారని, ఆ తర్వాత చేతులెత్తేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.