బీఆర్ఎస్ కు షాక్ ఎమ్మెల్యే జంప్
కాంగ్రెస్ కండువా కప్పుకున్న తెల్లం
హైదరాబాద్ – పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ , బీజేపీలో చేరారు. తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరొందిన తెల్లం వెంకట్రావు ఉన్నట్టుండి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ కంటే , పదవుల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. తన నియోజకవర్గం అభివృద్ది చెందడమే తన ముందున్న టార్గెట్ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తాను ఎవరితోనైనా కలుస్తానని, ప్రస్తుతం ప్రభుత్వం వైపు చూస్తున్నానని తెలిపారు.
ఆ మేరకు సీఎంను ఇటీవలే కలిశారు. ఇవాళ హస్తం గూటికి చేరి పోయారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసి ఉంచామని , ఎవరు వచ్చినా తీసుకుంటామని ప్రకటించారు సీఎం. మరో వైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారు. అంటే త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ కానుందా అన్న అనుమానం కలుగుతోంది.