హత్యలు చేసే వాళ్లకు టికెట్లా
సీఎం జగన్ రెడ్డిపై వైఎస్ షర్మిల
కడప జిల్లా – దారుణ హత్యలకు పాల్పడే వారికి, నిందితులుగా పేరు పొందిన వాళ్లకు వైసీపీ టికెట్లు ఇచ్చిందని ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని నిలదీశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. సోమవారం ఆమె ఏపీ న్యాయ యాత్రలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు.
ఈ సందర్బంగా షర్మిలకు ఘన స్వాగతం లభించింది. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు షర్మిల. దివంగత తన తండ్రి, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ది చేశారన్నారు.
స్టీల్ ఫ్యాక్టరీ తీసుకు రావాలన్నది ఆయన కల. ఒకవేళ ఇదే గనుక పూర్తి అయి ఉంటే 25 వేల మందికి పైగా ఉపాధి దొరికేదన్నారు వైఎస్ షర్మిల. తన తండ్రి వారసుడు తానేనని చెప్పుకునే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చేశాడని ప్రశ్నించారు.
నాలుగున్నర ఏళ్లు కుంభ కర్ణుడి లాగా నిద్ర పోయాడని, ఎన్నికల వేళ ఇప్పుడు మేల్కొన్నాడని ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్ కు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.