వైసీపీ మూకల విద్రోహ చర్య
టీడీపీ కార్యాలయానికి నిప్పు
అమరావతి – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉక్రోషంతోనే వైసీపీ మూకలు ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ప్రజా గళం సభ జన సునామీని తలపింప చేసిందన్నారు. దీంతో తట్టుకోలేక వైసీపీ మూకలు తమ పార్టీకి చెందిన ఆఫీసుకు నిప్పంటించారని ఆరోపించారు నారా లోకేష్.
ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని తేలి పోయిందన్నారు. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. అర్ధరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో టీడీపీ ఆఫీసుకు నిప్పంటించారని , రాక్షస ఆనందం పొందారని ఆరోపించారు నారా లోకేష్.
దాడులు, విధ్వంసంతో ప్రజా తీర్పును మార్చలేరన్న విషయాన్ని జగన్, ఆయన సామంతరాజు శంకర్రావు గుర్తించాలన్నారు. త్వరలో వైసిపిని జనం బంగాళాఖాతంలో కలప బోతున్నారని పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన టిడిపి కేడర్ సహనాన్ని చేతగానితనంగా భావించ వద్దని కోరారు.
పోలీసులు తక్షణమే స్పందించి క్రోసూరు ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.