జనసేనకు పోతిన మహేశ్ గుడ్ బై
విజయవాడ వెస్ట్ సీటు దక్కనందుకు
అమరావతి – ఎన్నికల వేళ బిగ్ షాక్ తగిలింది పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి. నిన్నటి దాకా కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు పోతిన మహేష్. ఆయన పార్టీ బలోపేతం కోసం ఎంతగానో కృషి చేశారు. విజయవాడ వెస్ట్ లో పలు కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు గత కొన్ని ఏళ్లుగా.
పార్టీ పరంగా ఎన్నికల్లో తనకు సీటు వస్తుందని ఆశించారు. ఆ మేరకు పార్టీ హై కమాండ్ కు కూడా ఎప్పటికప్పుడు తాను పోటీ చేసే విషయంపై క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్నికల్లో అనుకోని రీతిలో మూడు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి.
టీడీపీ, జనసేన, బీజేపీ గంప గుత్తగా సీట్లను పంచుకున్నాయి. ఈ తరుణంలో బీజేపీకి చెందిన సుజనా చౌదరికి కట్ట బెట్టారు జనసేనాని. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పోతిన మహేష్. ఇదా తనకు లభించిన గౌరవం అంటూ పేర్కొన్నారు.
తనకు బెజవాడ వెస్ట్ సీటు ఇవ్వాలని కోరుతూ పోతిన మహేష్ దీక్ష కూడా చేపట్టారు. అయినా వర్కవుట్ కాలేదు. ఎన్నికలయ్యాకు పార్టీ సముచిత స్థానం ఇస్తుందని హామీ ఇచ్చినా ఒప్పుకోలేదు. ఇవాళ తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు పోతిన మహేష్.