ప్రధానిపై సంజయ్ సింగ్ ఫైర్
కొందరి కోసమే పని చేస్తున్న మోదీ
న్యూఢిల్లీ – ఈ దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వాపోయారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు మరోసారి మోదీని గెలిపిస్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు సంజయ్ సింగ్.
అవినీతి పరులు, అక్రమార్కులు, ఆర్థిక నేరగాళ్లు, మాఫియా డాన్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు ప్రధానమంత్రి మోదీ వత్తాసు పలుకుతున్నాడని ధ్వజమెత్తారు. దీని వల్ల దేశానికి అత్యంత ప్రమాదం జరగనుందని పేర్కొన్నారు.
ఇకనైనా ప్రజలు మేలుకోవాలని లేక పోతే మోదీ సర్కార్ శాపంగా మారే ఛాన్స్ ఉందని నిప్పులు చెరిగారు. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో ఏకంగా భారతీయ జనతా పార్టీకి రూ. 6,000 కోట్లు వచ్చాయని, అవి ఎవరెవరు, ఏయే సంస్థలు, కంపెనీలు ఇచ్చాయో ప్రకటించాలని డిమాండ్ చేశారు సంజయ్ సింగ్.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగడం, దుర్వినియోగం చేయడం అన్యాయంగా డబ్బులు విరాళంగా పొందడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు.