ఆప్ పై రాజకీయ కుట్ర
ఎంపీ సంజయ్ సింగ్
న్యూఢిల్లీ – ఆప్ పై పూర్తిగా రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు ఎంపీ సంజయ్ సింగ్. ఆయన ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారు. మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ ను , ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని మోదీ కంకణం కట్టుకున్నాడని ధ్వజమెత్తారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఆప్ నేతలను టార్గెట్ చేశారని, ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం సిసోడియా, మంత్రి జైన్ లతో పాటు తనను జైలు పాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉందన్న నమ్మకాన్ని సీజేఐ చంద్రచూడ్ కలిగించారని కొనియాడారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు కుట్ర పూరితంగా నమోదైన కేసు ఏదైనా ఉందంటే అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ పేర్కొన్నారు ఎంపీ సంజయ్ సింగ్. ఈ కేసు ఉద్దేశం ఏదైనా కుంభకోణంపై దర్యాప్తు చేయడం కాదన్నారు. ఢిల్లీ, పంజాబ్ లలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఆప్ ప్రభుత్వాలను పడగొట్టడమేనని ఆరోపించారు.