రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్
ఉత్కంఠ పోరులో గుజరాత్ విక్టరీ
జైపూర్ – ఐపీఎల్ 2024లో భాగంగా జైపూర్ లోని మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ కొనసాగింది. మొత్తంగా ఇరు జట్లు పోరాట పటిమను ప్రదర్శించాయి. ఒక రకంగా పరుగుల వరద పారించాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డారు.
టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ కు దిగింది రాజస్థాన్ రాయల్స్. ఆది లోనే యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ వికెట్లను కోల్పోయింది. కష్టాల్లో ఉన్న సమయంలో మైదానంలో దిగిన కెప్టెన్ సంజూ శాంసన్ , రియార్ పరాగ్ లు కలిసి దుమ్ము రేపారు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నారు. ఇద్దరూ పోటీ పోడి షాట్స్ కొట్టారు.
ప్రధానంగా రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగితే ..ఆఖరున శాంసన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పరాగ్ 48 బంతులు ఎదుర్కొని 76 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. శాంసన్ 38 బంతులు ఆడి 68 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టాడు.
అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ధాటిగా ఆడింది. కెప్టెన్ గిల్ అద్భుతంగా ఆడాడు. 44 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 72 రన్స్ చేశాడు. సాయి సుదర్శన్ 3 ఫోర్లు ఒక సిక్సర్ తో 35 పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో 15 రన్స్ కావాల్సి వచ్చింది. కానీ రషీద్ ఖాన్ శాపంగా మారాడు. 11 బంతులు ఆడి 4 ఫోర్లతో 24 రన్స్ చేశాడు. తెవాటియా 11 బంతులు ఆడి 3 ఫోర్లతో 22 పరుగులతో గట్టెక్కించారు. రషీద్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.