విజయం తథ్యం కూటమిదే అధికారం
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆరు నూరైనా సరే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే విజయం అని స్పష్టం చేశారు టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అశేష జనవాహిని ముక్త కంఠంతో తాము అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈసందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో అందినంత మేర దండుకున్నారని ఆరోపించారు. తాము వచ్చాక అన్నింటిపై విచారణ చేపడతామని చెప్పారు. తమది 2047 విజన్ అని పేర్కొన్నారు.
అభివృద్దే ఎజెండాగా ముందుకు సాగుతామని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా దృష్టి పెడతామన్నారు నారా చంద్రబాబు నాయుడు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇక తమకు తిరుగే లేదన్నారు. జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు.