బాబూ..స్కామ్ ల సంగతేంటి..?
నిలదీసిన ఎంపీ విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. అబద్దాలకు కేరాఫ్ బాబు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు ఉన్నాయని, స్టేలు తెచ్చుకుని బతుకుతున్నాడని ఇప్పుడు కూటమి పేరుతో మరోసారి మోసం చేసేందుకు వస్తున్నాడని ఆరోపించారు.
ప్రజలు గత ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టినా చంద్రబాబుకు ఇంకా బుద్ది రాలేదన్నారు. ఎంత సేపు తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్పితే తనకు ఏమీ తెలియదన్నారు. వచ్చీ రాని ఇంగ్లీష్ తో విజన్ అంటూ, డాక్యుమెంట్ అంటూ , అభివృద్ది పేరుతో మరోసారి జనం చెవుల్లో పూలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.
ఇక నైనా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలను నమ్మ వద్దని ప్రజలకు విన్నవించారు విజయ సాయి రెడ్డి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగింది అంటే అది కేవలం వైసీపీ సర్కార్ , సీఎం జగన్ రెడ్డి ప్రయత్నం వల్లనేనని స్పష్టం చేశారు. ఎన్నో స్కామ్ లకు పాల్పడిన చంద్రబాబు అంతులేని ఆస్తులను పోగేసుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.