సెటిల్మెంట్లు చేస్తున్న సీఎం
ఆర్ ట్యాక్స్ అంటూ బీజేపీ ఫైర్
హైదరాబాద్ – ప్రజా పాలన పడకేసిందని , సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని సెటిల్మెంట్లు చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు భారతీయ జనతా పార్టీ ఎల్పీ నేత అల్లేటి మహేశ్వర రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
గతంలో బీఆర్ఎస్ సర్కార్ అడ్డగోలుగా విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టిందని ఇప్పుడు వాటిని రద్దు చేయడం, తిరిగి కేటాయించడం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీఎం అడ్డగోలుగా సెటిల్మెంట్లు చేయడం దారుణమన్నారు.
ఇదిలా ఉండగా నగరంలోని 15 ఎకరాల విలువైన భూమిని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ బండి పార్థ సారథి రెడ్డికి ఇచ్చారని తెలిపారు. ఇది హెటిరో సంస్థకు కేటాయించారని అన్నారు. రూ. 1500 కోట్ల సర్కార్ భూమిని అప్పనంగా నెలకు ఎకరానికి రూ. 2 లక్షల చొప్పున 30 ఏళ్లకు లీజుకు ఇచ్చారని, ఏ ప్రాతిపదికన, ఎందు కోసం ఇచ్చారో చెప్పాలన్నారు.
అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చాక భూమిని తిరిగి తీసుకున్నారు. కానీ జీవో 37 ను విడుదల చేసి అదే భూమిని రూ. 15 లక్షలతో హెటిరోకు కేటాయించారని సంచలన ఆరోపణలు చేశారు అల్లేటి మహేశ్వర రెడ్డి. సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం హెటిరో ఏడాదికి రూ. 50 కోట్లు చెల్లించాలన్నారు. రేవంత్ రెడ్డి సదరు సంస్థతో రూ. 300 కోట్లు తీసుకున్నాడని , ఢిల్లీకి పంపించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకాలు, సెటిల్ మెంట్ల పై ఆధారాలతో బయట పెడతామని హెచ్చరించారు.