రేవంత్ మోసం మాదిగలకు అన్యాయం
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
హైదరాబాద్ – కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా మాదిగ జాతి ఉందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని తప్పు దోవ పట్టిస్తూ కేవలం మాలలకే టికెట్లు కేటాయించేలా చేశారంటూ ఆరోపించారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
మాల సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం, ఆయన సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ తో పాటు గడ్డం వివేక్ కొడుక్కి ఎలా సీటు ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో వినోద్ కు చెందిన సోదరుడు వివేక్ , తనయుడు వంశీ మొత్తం ముగ్గురికి పదవులు దక్కాయని చెప్పారు.
అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తనకు తెలియడం లేదన్నారు. బలమైన సామాజిక వర్గంగా మాదిగలు ఉన్నారని, కానీ మాలల నిర్వాకం వల్ల గుర్తింపునకు నోచుకోలేక పోతున్నారని ఆవేదన చెందారు.
17 సీట్లలో ఒక్క సీటుకు కూడా మాదిగలు అర్హులు కారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు నర్సింహులు. తన జీవిత కాలంలో 10 మంది సీఎంలను చూశానని కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుడిగా తాను బాధ పడుతున్నాని అన్నారు .