NEWSTELANGANA

రైతుల‌ను మోసం చేస్తే చ‌ర్య‌లు

Share it with your family & friends

హెచ్చ‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సుల‌ను రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపి వేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు.

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని, ధాన్యం ఆర బెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలన్నారు . కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని అన్నారు.

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏ రోజుకారోజు రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించాలని సూచించారు. సంబంధిత విభాగాల అధికారులు పలు జిల్లాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించాలన్నారు.