నీటి సరఫరాపై ఫోకస్ పెట్టండి
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెరుగుతున్న ఎండల కారణంగా రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినా వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ పెరిగిన అవసరాలకు సరిపోవటం లేదని, భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధార పడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.
సాగు నీటి సమస్యపై ఎనుముల రేవంత్ రెడ్డి సమీక్షించారు. మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు తాగునీటి ఇబ్బందులున్న చోటికి స్వయంగా వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా, డిమాండ్ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తరలించాలని, అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆదేశించారు. ఇటు సింగూర్ నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు.
కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సీఎం చెప్పారు. అకారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.