ఇండియా కూటమిదే పవర్
స్పష్టం చేసిన సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు – బీజేపీ నియంతృత్వ ధోరణిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఆయన ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఆరు నూరైనా సరే ఈసారి ఇండియా కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు ఎంకే స్టాలిన్. దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో ఉందన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రకు మోదీ తెర లేపాడంటూ ధ్వజమెత్తారు.
తమిళనాడులో మోదీ, అమిత్ షా ఆటలు చెల్లవన్నారు. ఇక్కడి ప్రజలు ఆత్మాభిమానం కోసం ఏమైనా చేసేందుకు సిద్దంగా ఉంటారని స్పష్టం చేశారు సీఎం. కాషాయం పేరుతో రాజకీయం చేయాలని చూస్తే కర్ర కాల్చి వాత పెట్టడం తప్పదన్నారు.
ఈ దేశంలో కేవలం భాషా ప్రాతిపదికన ఏర్పడిన తమ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛను, ఆత్మాభిమానాన్ని, అంతకు మించిన గౌరవాన్ని కోరుకుంటారని అన్నారు ఎంకే స్టాలిన్.