ఉత్తరాఖండ్ తో బలమైన బంధం
రాంనగర్ ప్రచార సభలో ప్రియాంక
ఉత్తరాఖండ్ -ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్ తో తమ కుటుంబానికి చాలా పాత సంబంధం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రియాంక గాంధీ రాంనగర్ లో జరిగిన రోడ్ షో లో పాల్గొన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మా చిన్న నాటి జ్ఞాపకాలు ఇక్కడ అనేకం ఉన్నాయని చెప్పారు. మా నాన్న రాజీవ్ గాంధీ , సోదరుడు రాహుల్ గాంధీ, తన కొడుకుతో పాటు తాను కూడా ఇక్కడే చదువుకున్నామని చెప్పారు. సెలవులు దొరికినప్పుడల్లా పిల్లలతో కలిసి ఇక్కడికి తరుచూ వస్తూనే ఉంటామన్నారు ప్రియాంక గాంధీ. ఇవాళ రాం నగర్ కు రావడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈసారి జరగబోయే ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును జాగ్రత్తగా వినియోగించు కోవాలని సూచించారు ప్రియాంక గాంధీ. కులం పేరుతో, మతం పేరుతో ప్రజలను విడ దీయాలని, తద్వారా విద్వేషాలతో ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈసారి ఇండియా కూటమిదే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.