రేవంత్ పాలన బేకార్ – కేసీఆర్
సీఎంకు అంత సీన్ లేదు
రంగారెడ్డి జిల్లా – ఆచరణకు నోచుకోని హామీలతో పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై \నిప్పులు చెరిగారు మాజీ సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన తమ పార్టీ నుంచి జంప్ అయిన రంజిత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. అధికారం ఉన్న చోటల్లా తిరిగేందుకు రంజిత్ రెడ్డి పొద్దు తిరుగుడు పువ్వా అంటూ ఎద్దేవా చేశారు. పదవుల కోసం పార్టీలు మారే ఇలాంటి వాళ్లకు , నీతి లేనోళ్లకు ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు కేసీఆర్.
రాష్ట్రంలో పాలన పడకేసిందని, పదే పదే సీఎం ఢిల్లీకి పోవడం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు కేసీఆర్. ఇక్కడ లూటీలు మాత్రమే ఉన్నాయని బాలికలకు ఇస్తామన్న స్కూటీలు లేవన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు ఆగి పోయిందని ప్రశ్నించారు. అసలు బ్రోకర్లు ఎవరో , జోకర్లు ఎవరో ప్రజలకు తెలిసి పోయిందన్నారు .
ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా ఏకి పారేశారు కేసీఆర్. అయితే మోదీ లేకుండా ఈడీ ఇదే బీజేపీ నేర్చుకున్న, నెరుపుతున్న రాజకీయం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతానన్న ఆ పార్టీకి ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు.
1.30 లక్షల మంది దళితులకు దళిత బంధు మంజూరు చేశామని, ప్రొసీడింగ్‌లు జరిగాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. ఖాతాలను స్తంభింప చేసిందని ఆరోపించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద 1.30 లక్షల మంది దళితులతో దీక్ష చేపడతానంటూ హెచ్చరించారు.