బీజేపీపై ఎలక్టోరల్ బాండ్స్ ఎఫెక్ట్
అంతర్గత సర్వేలో ఆసక్తికర అంశాలు
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా తమకు వస్తాయని పదే పదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా చెబుతున్నా వాస్తవ పరిస్థితి చూస్తే అంకెలకు దూరంగా ఫలితాలు ఉండ బోతున్నాయని సమాచారం. ఆ పార్టీ స్వయంగా అంతర్గత సర్వే చేపట్టినట్లు టాక్. ఇందులో ప్రధానంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు బీజేపీకి శాపంగా మారినట్లు భావిస్తున్నారు.
ప్రధానంగా ఏ పార్టీకి లేనంతగా ఏకంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ. 6,000 కోట్లు సమకూరడం, అదంతా అవినీతి, అక్రమాలకు పాల్పడిన కంపెనీలు అయాచితంగా బాండ్లను కొనుగోలు చేయడం విస్తు పోయేలా చేసింది. ఈ తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో కొంత మేరకు ఓటు బ్యాంకును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
అగ్ని పథ్ , రైతుల ఆందోళన, నిరుద్యోగం ఎక్కువగా ప్రభావితం చూపనున్నాయి. ప్రధానంగా హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో వీటి ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దాదాపు 12 సీట్లను కోల్పోనుందని టాక్. రాజస్థాన్ లోని చురు, దౌసా, టోంక్ , కరౌలి, నాగౌర్ , గంగానగర్ లలో కాంగ్రెస్ గాలి వీస్తోందని భావిస్తోంది. అంతే కాకుండా రోహ్‌తక్, సిర్సా, సోనేపట్ హెచ్‌ఆర్ స్థానాల్లో బీజేపీ ప్రాబల్యాన్ని కోల్పోనుందని సర్వేలో వెల్లడి కావడం విశేషం.