సంయమనం పాటించండి – సీఎం
ఆందోళన చెందవద్దని సూచన
విజయవాడ – మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కనిపించకుండా రాయి విసిరాడు. అది నేరుగా సీఎం నుదుటిపైకి వచ్చి తాకింది. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. కంటి పై భాగానికి బలమైన గాయమైంది. దీంతో హుటా హుటిన బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు వైద్యులు.
డాక్టర్ల సూచనల మేరకు కేసరపల్లి స్టే పాయింట్ నుంచి నేరుగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు జగన్ మోహన్ రెడ్డిని. గాయాన్ని పరిశీలించి కుట్లు వేశారు వైద్యులు. ఈ సందర్బంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరినీ నిందించ దల్చుకోలేదని అన్నారు.
రాజకీయాలలో ఇవన్నీ మామూలేనని పేర్కొన్నారు. అన్నింటికి సిద్దపడే తాము ఎన్నికల రంగంలోకి దిగామన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదని స్పష్టం చేశారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ కూడా తన పట్ల ఆందోళన చెందవద్దని సీఎం కోరారు. అందరూ సంయమనంతో ఉండాలని, ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా మీరు రెచ్చి పోవద్దని కోరారు. తాను ఎవరికీ భయపడనని, సింహం లాగా తిరిగి వస్తానని చెప్పారు.