ఎవరికి ఓటేసినా బీజేపికి వేసినట్టే
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా అది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్లేనని అన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఏపీ న్యాయ యాత్రలో పాల్గొని ప్రసంగించారు. తాజాగా శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాలలో పర్యటించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నా లేనట్టేనని ఎద్దేవా చేశారు. ఎందుకంటే జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తాము పవర్ లోకి వచ్చిన కర్ణాటక, తెలంగాణలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు వైఎస్ షర్మిల.
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎందుకు ప్రయత్నం చేయడం లేదంటూ ప్రశ్నించారు. మాయ మాటలతో ఓట్లు అడిగేందుకు వస్తున్న వారికి తగిన రీతిలో బుద్ది చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. తమ విలువైన ఓట్లను ఆచి తూచి వేయాలని సూచించారు ఏపీ పీసీసీ చీఫ్.