కాషాయం సంక్షేమ జపం
బీజేపీ మేనిఫెస్టోలో కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ – ఎట్టకేలకు పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ జపం చేయడం విశేషం. సూర్య ఘర్ పథకం కింద పేదలకు ఉచితంగా విద్యుత్ అందజేస్తామని పేర్కొంది. పేదల కోసం దేశ వ్యాప్తంగా 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ.
70 ఏళ్ల లోపు అందరికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించేలా చేస్తామని పేర్కొంది. ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేసింది. పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ సబ్సిడీ ధరకు గ్యాస్ పంపిణీ చేస్తామని తెలిపింది. మహిళలను లక్షలాధికారులను చేస్తామని పేర్కొంది.
ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల ప్రయోజనం కొనసాగుతుందని , ఉచిత రేషన్ పథకం వచ్చే ఐదేళ్ల పాటు వర్తింప చేస్తామని, డోర్ టు డోర్ కరెంటు డెలివరీతో పాటు కరెంటు అమ్మే ప్లాన్ తీసుకు వచ్చింది బీజేపీ.
జన ఔషధ్ షాపులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. యువ పారిశ్రామికవేత్తలకు బంగారు అవకాశం కల్పిస్తామని పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు ముద్ర యోజన కింద ఇస్తున్న రూ. 10 లక్షలను మరో 10 లక్షలు పెంచేలా చేసింది.
సెల్ఫ్ ఫైనాన్సింగ్ పథకం గ్రామాలకు విస్తరించనుంది. జాతీయ సహకార విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. బౌద్ద క్షేత్రమైన నలందను అభివృద్ది చేస్తామని , ఒకే దేశం ఒకే ఓటు తీసుకు వస్తామని ప్రకటించారు నరేంద్ర మోదీ.