అంబేద్కర్ కు అవమానం తగదు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల సరైన రీతిలో వ్యవహరించ లేదంటూ ఆవేదన చెందారు.
సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఈ మేరకు అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ కావాలని అవమానానికి గురి చేసిందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్రం రాని రోజుల నుండీ బాబా సాహెబ్ ను లక్ష్యంగా చేసుకుని పనిగట్టుకుని వివక్షను ప్రదర్శించిందని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఈ దేశంలో బడుగులు, బలహీన వర్గాల పట్ల వివక్షా పూరిత ధోరణిని కలిగి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప మరోటి కాదన్నారు. న్యాయ శాఖ మంత్రిగా అండేద్కర్ ఆనాడు రాజీనామా చేసేందుకు కూడా ప్రధాన కారణం ఆ పార్టీనేనంటూ ఆరోపించారు.
అంబేద్కర్ తట్టుకోలేక తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పటికీ పట్టించు కోలేదని వాపోయారు. అంతే కాదు డాక్టర్ బాబా సాహెబ్ కు భారత రత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకించిందని ధ్వజమెత్తారు. ఈ దేశంలో మరో అంబేద్కర్ ను తయారు చేయకుండా అడ్డుకున్నది ఆ పార్టీ కాదా అని ప్రశ్నించారు.