కూటమికి తప్పదు ఓటమి
ఏపీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – టీడీపీ కూటమికి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్దం పేరుతో చేపట్టిన బస్సు యాత్రకు భారీ ఎత్తున స్పందన లభించింది. ఈ సందర్బంగా గుడివాడలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు జగన్ రెడ్డి.
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలను అద్భుతమైన ఆదరణ లభించడం తనకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఇవాళ గుడివాడ మహా సముద్రాన్ని తలపింప చేస్తోందని కొనియాడారు సీఎం. ఈ సభకు వచ్చిన నా అక్క చెల్లమ్మలకు, అన్నదమ్ములకు, అవ్వాతాతలకు, ప్రతీ ఒక్కరికీ నిండు మనసుతో మీ కుటుంబ సభ్యుడుగా చేతులెత్తి నమస్కరిస్తున్నానని , ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు జగన్ రెడ్డి.
పేదల భవిష్యత్తు కోసం.. పథకాలన్నీ కాపాడుకోవడానికి, కొనసాగింపునకు, ఇంటింటి అభివృద్ధిని, పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టు కోవడం కోసం ఆ పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని పిలుపునిచ్చారు. ఫ్యాన్ గాలికి సైకిల్ , కమలం, గ్లాసు పంక్చర్ కావాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు జగన్ మోహన్ రెడ్డి.