అన్నామలై దమ్మున్నోడు – మోదీ
ప్రశంసలు కురిపించిన ప్రధానమంత్రి
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కె. అన్నామలై కుప్పుస్వామి అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడంటూ కొనియాడారు.
ఏఎన్ఐ చీఫ్ ఎడిటర్ స్మితా ప్రకాశ్ తో ప్రధానమంత్రి ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే, తదితర పార్టీలన్నీ వారసత్వ రాజకీయాలను నమ్ముకున్నాయని ఆరోపించారు. కానీ తమ పార్టీ యువ నాయకులను ప్రోత్సహిస్తూ వస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా తమిళనాడులో కె. అన్నామలై , కర్ణాటకలో తేజస్వి సూర్య , తెలంగాణ లో బండి సంజయ్ లాంటి ఎందరో యంగ్ బ్లడ్ కు ఛాన్స్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు ప్రధానమంత్రి.
తాము ఈ దేశం కోసం ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెడతామని , కానీ ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి కేవలం ఆరోపణలు, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు నరేంద్ర మోదీ. రాబోయే ఎన్నికల్లో తమకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.