ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విక్టరీ
టోర్నీలో వరుసగా ఆర్సీబీకి ఓటమి
బెంగళూరు – ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. చిన్న స్వామి మైదానంలో పరుగుల వరద పారింది. చివరి దాకా పోరాడి ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇరు జట్ల బౌలర్లు తేలి పోయారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది మైదానం అంతా.
విచిత్రం ఏమిటంటే ఆర్సీబీపై హైదరాబాద్ గెలుపుతో హ్యాట్రిక్ సాధించింది. ఎస్ ఆర్ హెచ్ రికార్డ్ స్కోర్ సాధించింది. హెడ్ సూపర్ సెంచరీ సాధిస్తే దినేష్ కార్తీక్ చివరి దాకా ఉండి గెలుపు అంచుల దాకా తీసుకు వెళ్లాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.
ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు కసి మీద ఆడారు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఇరు జట్లు భారీ స్కోర్లను నమోదు చేశాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు నమోదు కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఎస్ ఆర్ హెచ్ 3 వికెట్లు కోల్పోయి ఏకంగా 287 రన్స్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్కడా తడబడలేదు. డుప్లెసిస్ , విరాట్ కోహ్లీ దుమ్ము రేపారు. లేటు వయసులో దినేష్ కార్తీక్ చుక్కలు చూపించాడు. బ్యాట్ తో అదరగొట్టాడు. ఏకంగా ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కలపి 38 సిక్సర్లు , 43 ఫోర్లు వచ్చాయి.
ట్రావిస్ హెడ్ 41 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 8 సిక్సర్లతో 102 రన్స్ చేశాడు. క్లాసెన్ 31 బంతుల్లో 67 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీలో 7 వికెట్లు కోల్పోయి 262 రన్స్ చేసింది. దినేష్ కార్తీక్ 35 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 7 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. 83 రన్స్ చేశాడు. డుప్లెసిస్ 28 బంతుల్లో 62 కొట్టాడు. ఇందులో 7 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 42 రన్స్ చేశాడు. 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.