విశ్వ బ్రాహ్మణులను ఆదుకుంటా
ఎంపీ విజయ సాయి రెడ్డి భరోసా
నెల్లూరు జిల్లా – కుల వృత్తులను నమ్ముకుని మానవ సమాజానికి ఆదర్శ ప్రాయంగా ఉంటూ వస్తున్న విశ్వ బ్రాహ్మణులను అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. మేమంతా సిద్దం బస్సు యాత్ర సందర్బంగా ఆయన నెల్లూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో అందరికంటే ముందంజలో కొనసాగుతున్నారు.
నెల్లూరు ప్రాంతాన్ని దేశంలోనే నెంబర్ వన్ సిటీగా మారుస్తానని ఇప్పటికే ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా విశ్వ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కీలక మీటింగ్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
కుల వృత్తులు లేక పోతే పల్లెలు అభివృద్ది చెందవన్నారు. ఈనాటికీ వ్యవసాయానికి జీవనాధారంగా ఉన్నది, రైతులకు అండగా పనిముట్లు తయారు చేసి ఆదుకున్న చరిత్ర విశ్వ బ్రాహ్మణులదేనని కొనియాడారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
నెల్లూరు నగరాన్ని సుందర వనంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. స్థానిక వ్యాపారులు, కొనుగోలుదారులు, కార్మికులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి విశేష స్పందన లభించింది. మార్కెట్ లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు కల్పించి ఉన్నత ప్రమాణాలతో మార్కెట్ ను ఆధునీకరిస్తామన్నారు
నెల్లూరు జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే సిబ్బందికి అండగా ఉండానని విజయ సాయి రెడ్డి హామీ ఇచ్చారు.