జగన్ రాయి దాడి కేసులో పురోగతి
సతీష్ కుమార్ అనే వ్యక్తి గు్ర్తింపు
విజయవాడ – తెలుగు రాష్ట్రాలలో సంచలం కలిగించింది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసు. విజయవాడ వేదికగా మేమంతా సిద్దం బస్సు యాత్ర చేపట్టారు జగన్ రెడ్డి. ప్రచారంలో పాల్గొన్న ఆయనపై రాయితో దాడి చేశారు. ఈ సమయంలో ఆయన నుదుటిపై బలమైన గాయం అయ్యింది. ఆ వెంటనే భద్రతా సిబ్బంది హుటా హుటిన బస్సులోకి తీసుకు వెళ్లారు. అందులో జగన్ రెడ్డికి ప్రాథమిక చికిత్స చేశారు.
వైద్యులు బలమైన గాయమైనందున విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం విజయవాడ లోని ప్రభుత్వ ఆస్పత్రికి జగన్ రెడ్డిని తరలించారు. అక్కడ ఆయన నుదుటిపై గాయానికి చికిత్స చేపట్టారు. ప్లాస్టర్ వేశారు. ఇదే ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పూర్తి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. దీంతో విచారణకు ఆదేశించారు డీజీపీ.
విజయవాడ సీపీ క్రాంతి రాణా ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు జగన్ రెడ్డిపై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. విజయవాడ లోని సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అనే యువకుడని తేల్చారు. అతడితో పాటు నలుగురు స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ సత్తి అని స్పష్టం చేశారు.