దోచు కోవడం జగన్ నైజం
అమరావతి – టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి శని లాగా జగన్ రెడ్డి దాపురించాడని మండిపడ్డారు. ఒక రకంగా ఆయనను చూసి జనం బెంబేలెత్తి పోతున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని, అప్పుల కుప్పగా మార్చేశాడని ధ్వజమెత్తారు. ప్రజల రక్తాన్ని జలగలా పీల్చేశాడని వాపోయారు.
ఇవాళ సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు. మద్య నిషేధం విధిస్తానని మాయ మాటలు చెప్పాడని ఇప్పుడు గల్లీకో దుకాణం తెరిచాడంటూ ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. తాను ఉన్నప్పుడు కరెంట్ బిల్లు మీ అందరికీ నెలకు రూ. 200 మాత్రమే వచ్చేదన్నారు. కానీ ఇవాళ జగన్ పాలనలో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయని మండిపడ్డారు. ఏకంగా రూ. 600 నుంచి రూ. 1000 దాకా వస్తున్నాయని తెలిపారు.
ఈ ఐదేళ్ల కాలంలో వాడకాన్ని బట్టి రూ. 30 వేల నుంచి రూ. లక్ష దాకా దోచుకున్నాడని జగన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి లీటర్ కు రూ. 40 దోచేశాడని ఆరోపించారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, తానేమో ప్యాలెస్ లో ఉంటున్నాడని ఎద్దేవా చేశారు.