నిరుద్యోగులు లేకుండా చేస్తాం
న్యూఢిల్లీ – ఢిల్లీ ఎన్నికల సందర్బంగా ఆప్ మేనిఫెస్టోను విడుదల చేసింది. నిరుద్యోగులు లేని రాజధానిగా ఢిల్లీని మారుస్తామని ప్రకటించింది. అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు ఇస్తామని, మహిళా సమ్మాన్ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 2100 ఇస్తామని పేర్కొంది.
సోమవారం ఢిల్లీలో ఆప్ పార్టీ చీఫ్ , మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి సింగ్ , మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
సంజీవని పథకం కింద 60 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని, నీటి బిల్లులు మాఫీ చేస్తామని, యూరప్ తరహాలో రోడ్లు నిర్మిస్తామని, విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
యమునా నదిని క్లీన్ చేస్తామని, మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పిస్తామని , కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. రాజధాని నగరంలో ప్రస్తుతం డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందిగా మారిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు కేజ్రీవాల్. . ఆటో, టాక్సీ, ఈ- రిక్షా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ. లక్ష సాయం చేస్తామన్నారు. అంతే కాకుండా వారి పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా కల్పిస్తామని ప్రకటించారు .