ప్రధాని మోడీ రాజీనామా చేయాలి
మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏ మాత్రం నైతికత ఉంటే వెంటనే ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆప్ నేతలు మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల ప్రచారం సందర్బంగా పదే పదే 400 సీట్లు వస్తాయని ప్రకటించారని, దేశాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర పన్నాడని, అంతే కాకుండా ఈ దేశంలో రిజర్వేషన్లను తీసి వేయాలని కోరుకున్నాడని అందుకే ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు.
ఏ మాత్రం బీజేపీ నేతలకు సిగ్గూ శరం ఉంటే వెంటనే తమ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సంజయ్ సింగ్. ఆయనకు 400 సీట్లు కాదు కదా అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన సీట్లు కూడా ఇచ్చేందుకు ఇష్ట పడలేదన్నారు. ఈ దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలని కోరుకున్నారని అది ఎన్నికల రిజల్ట్స్ లో తేలిందన్నారు.