నిప్పులు చెరిగిన మంత్రి అతిషి
న్యూఢిల్లీ – ఆప్ ను అంతం చేయాలని, ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ ను దించాలని గత 10 ఏళ్లుగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉందని ఆరోపించారు ఆప్ మంత్రి అతిషి. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్వాతి మలివాల్ కేసు వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఏదైనా ఎదుర్కోవాలని అనుకుంటే రాజకీయంగా ఓటు అనే ఆయుధంతో ఉపయోగించు కోవాలని సూచించారు. కానీ దొడ్డి దారిన డబ్బులు చూపి ప్రభావితం చేయడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ గుప్పిట్లోకి ఉంచుకుని కేసులు నమోదు చేస్తామని బెదిరించడం మంచిది కాదన్నారు. ఇది ఆ పార్టీకే తిరిగి నష్టం చేకూరుతుందన్న విషయం గుర్తిస్తే చాలన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు ఈడీ ఒక్క ఆధారాన్ని కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా చూపించ లేక పోయిందని అన్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో, సోదాల్లో ఒక్క రూపాయి కూడా బయట పడలేదన్నారు. ఒకవేళ దొరికితే చెప్పాలన్నారు. ఇక స్వాతి మలివాల్ బీజేపీ ఉచ్చులో చిక్కుకుందని ధ్వజమెత్తారు.