ఏ1గా చేర్చిన అవినీతి నిరోధక శాఖ
అమరావతి – మాజీ మంత్రి విడుదల రజనీకి బిగ్ షాక్ తగిలింది. ఆమెపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. 2020లో శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు మోపారు. అంతే కాకుండా రూ. 2 కోట్ల 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయని తెలిపింది ఏసీబీ. ఈ మేరకు ఈ కేసులో భాగంగా విడుదల రజనీని ఏ1గా చేర్చామన్నారు. ఇదిలా ఉండగా కూటమి సర్కార్ ఉక్కు పాదం మోపుతోంది. గత ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దందాలకు, అక్రమాలకు పాల్పడిన వారిని టార్గెట్ చేసింది.
ఇప్పటికే విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. తాను రాసిన రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్నా వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ మేరకు వరుసగా ఒకరి తర్వాత మరొకరు వైసీపీ సీనియర్ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయగా నిన్ననే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మరో వైపు మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. ఆయన ముందస్తు బెయిల్ తో బయటపడ్డాడు. తాజాగా విడుదల రజినిపై కేసు నమోదు కావడంతో వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది.