ఏసీబీకి చిక్కిన మహబూబ్ నగర్ డీఈఓ
రూ. 50,000 లంచం తీసుకుంటూ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర అవినీతి శాఖ (ఏసీబీ) జూలు విదిల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. ప్రభుత్వ ఆజమాయిషీ లేక పోవడం, అక్రమార్కులకు అడ్డే లేకుండా పోతోంది. దీంతో తమకేం కాదనే ధీమాతో విచ్చలవిడిగా ఉన్నతాధికారులే గతి తప్పుతున్నారు. ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన వాళ్లు అడ్డంగా బుక్కై పోతున్నారు.
దీంతో గతంలో కంటే ప్రస్తుతం ఏసీబీ మరింత పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఎవరైనా, ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే తమకు సమాచారం అందిస్తే చాలని, ఫిర్యాదుదారుల పేర్లు కానీ, వారికి సంబంధించిన వివరాలను బయట పెట్టబోమంటూ భరోసా ఇచ్చింది.
దీంతో పలువురు బాధితులు తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. మరికొందరు ధైర్యంగా ముందుకు వచ్చి అవినీతిపరుల, అక్రమార్కుల బాగోతాన్ని బట్ట బయలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో పలువురు ఉన్నతాధికారులు పట్టుబడ్డారు. వారిలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసిన గోపాల్ రెడ్డి ఒకరు.
తాజాగా మహబూబ్ నగర్ జిల్లా విద్యా శాఖాధికారి ఆటి రవీందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ. 50,000 తీసుకుంటూ బుక్కయ్యాడు. ఫిర్యాదుదారుని భార్య పదోన్నతికి సంబంధించి తను లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగింది వల పన్ని పట్టుకుంది.
ఈ సందర్బంగా ఏసీబీ ప్రజలకు ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయాలని కోరింది.