కణితిని తొలగించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
వృత్తి రీత్యా డాక్టర్ అయిన వంశీకృష్ణ
నాగర్ కర్నూల్ జిల్లా – నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట శాసన సభ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ చర్చనీయాంశంగా మారారు. ఆయన ఆపద సమయంలో తన వృత్తి ధర్మాన్ని చాటుకున్నారు. తాను ప్రజా ప్రతినిధి అయినప్పటికీ ఓ రోగి ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆ వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అనిత అనే మహిళా రోగికి చికిత్స చేశారు.
ఆపై 10 కిలోల బరువు కలిగిన కణితి ఉన్నట్లు గుర్తించారు. టెస్టుల అనంతరం వెంటనే ఆస్పత్రిలోని ల్యాబ్ రూమ్ లో ఆమెకు శస్త్ర చికిత్స చేశారు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ. ఇతర వైద్య బృందంతో కలిసి ఆయన ఆపరేషన్ ను నిర్వహించారు.
ఇదిలా ఉండగా 2017లో నాగర్ కర్నూల్ జిల్లాలోని సీబీఎం ఆస్పత్రిలో డాక్టర్ వంశీకృష్ణ ఓ మహిళ కడుపులో 4.7 కిలోల ఉన్న కణితిని తొలగించారు . అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన ధర్మాన్ని మరిచిపోని వంశీకృష్ణను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.