పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్ – తన తండ్రి నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలని కోరారు నటుడు నందమూరి బాలకృష్ణ. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అరుదైన నాయకుడు అని పేర్కొన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. కాగా తనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. తనను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు దేశ రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయి. సినీ రంగంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా గుర్తింపు పొందారు. అంతే కాదు కేవలం 9 నెలల్లోనే రాజకీయ పార్టీని స్థాపించాడు. చరిత్ర సృష్టించాడు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నామ రూపాలు లేకుండా చేశాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సంచలనం సృష్టించింది. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తనకే దక్కుతుంది. విశిష్ట సేవలు అందించినందుకు గాను భారత రత్న పురస్కారం ఇవ్వాలని కోరారు నందమూరి నట సింహం.