కలకలం రేపుతున్న జెత్వానీ కేసు
పోలీసుల పాత్రపై డీజీపీ ఆరా
అమరావతి: ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంలో కీలక అప్డేట్ వచ్చింది. జెత్వానీ స్టేట్మెంట్ను రికార్డు చేయాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆమెను తీసుకొస్తున్నారు.
జెత్వానీ న్యాయవాదులు, ఆమె కుటుంబ సభ్యులతో విజయవాడ నగర పోలీసు కమీషనర్ మాట్లాడుతున్నారు. దర్యాప్తు అధికారిగా ఉన్న డాక్టర్ స్రవంతి రాయ్‌తో కూడా జెత్వానీ ఫోన్లో మాట్లాడారు. కేసు వివరాలను, సాక్ష్యాలను, అప్పట్లో చేసిన చిత్ర హింసలకు సంబంధించిన వివరాలను తమకు వివరించాలని స్రవంతి రాయ్ కోరారు.
ఇదిలా ఉండగా నటి కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ కథనాలు వస్తున్నాయని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
డీజీపీ ఈ కేసు వివరాలపై ఆరా తీశారని పేర్కొన్నారు. ‘‘స్రవంతి రాయ్ అనే అధికారిని విచారణ కోసం నియమించాం. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకుంటాం. చీటింగ్ కేసులో నటితో పాటు కుటుంబం మొత్తాన్ని ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తాం. ఆ రోజు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలుతుంది.
నాలుగైదు రోజుల్లో ఈ విచారణ పూర్తవుతుంది. మొత్తం ఈ కేసులో అన్ని కోణాల్లో సాంకేతికతతో ఆధారాలు సేకరిస్తాం. నివేదిక రూపంలో డీజీపీకి అందచేస్తాం. ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లు తేలితే డీజీపీ చర్యలు తీసుకుంటారు’’ అని సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు..