ENTERTAINMENT

కొండా సురేఖ కామెంట్స్ పై నాని ఫైర్

Share it with your family & friends

ఇలాంటి నిరాధార వ్యాఖ్య‌లు చేస్తే ఎలా

హైద‌రాబాద్ – త‌న ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను కూల్చ‌కుండా ఉండేందుకు కేటీఆర్ వ‌ద్ద‌కు ఒక్క రాత్రి స‌మంత రుత్ ప్ర‌భు వెళ్లాల‌ని అక్కినేని నాగార్జున , అమ‌ల ఫ్యామిలీ ఒత్తిడి చేసిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌. ఆమె చేసిన వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

దీనిపై సినిమా రంగానికి చెందిన ప్ర‌ముఖులు తీవ్రంగా స్పందించారు. గురువారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా ప్ర‌ముఖ న‌టుడు నాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొండా సురేఖ ఇలాంటి కామెంట్స్ చేయ‌డం బాధ క‌లిగించింద‌ని పేర్కొన్నారు.

రాజకీయ నాయకులు ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా తప్పించు కోవచ్చని అనుకోవడం చూస్తే అసహ్యం వేస్తుంద‌న్నారు. మీ మాటలు చాలా బాధ్యతా రహితంగా ఉన్నప్పుడు, మీ ప్రజల పట్ల మీకు ఏదైనా బాధ్యత ఉంటుందని ఆశించడం మా తెలివితక్కువ పని అని పేర్కొన్నారు నాని.

ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇంత గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదన్నారు. మన సమాజాన్ని చెడుగా ప్రతిబింబించే ఇలాంటి ఆచారాన్ని మనందరం ఖండించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు.