తప్పు చేస్తే నరికేయాలన్న నటుడు
అమరావతి – సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా లోకేష్, భువనేశ్వరిలపై నోరు పారేసుకున్నాడని ఆరోపిస్తూ ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆయనను ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు తరలిస్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని కృష్ణ మురళి. తాజాగా గుంటూరు కోర్టులో విచారణ నిమిత్తం పోసాని కృష్ణ మురళిని పోలీసులు హాజరు పరిచారు. ఈ సందర్బంగా వాదోప వాదనలు కొనసాగాయి. ఎవరూ ఊహించని రీతిలో పోసాని జడ్జి ముందు కంట తడి పెట్టారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఒకవేళ తప్పు చేసినట్లు రుజువైతే తనను నరికి వేయాలని కోరారు.
పోసాని కంటతడి పెట్టడం చూసి న్యాయమూర్తి చలించి పోయారు. మీకు చెప్పుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా గత వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు. ఇదే సమయంలో ఆయన నోరు పారేసుకున్నారు. దీంతో నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రెడ్ బుక్ రాస్తున్నానని, అందులో రాసిన పేర్ల వారీగా అరెస్ట్ చేయడం ఖాయమని ప్రకటించారు. ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ కాగా ఇంకా పేర్ని నాని, కొడాలి నాని, రోజా మిగిలి ఉన్నారు.