బిజేపీతో శరత్ కుమార్ దోస్తానా
తమిళనాడు రాజకీయాల్లో మార్పు
తమిళనాడు – పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా తమిళనాడులో రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎలాగైనా సరే ఈసారి వై నాట్ 400 అనే నినాదంతో ముందుకు వెళుతోంది కాషాయ పార్టీ. ఈ మేరకు భావ సారూప్యత కలిగిన పార్టీలు, వ్యక్తులు, సంస్థలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై కీలకంగా మారారు. ఎలాగైనా సరే ఈసారి జరగబోయే ఎన్నికల్లో కమలం జెండా ఎగుర వేయాలని కంకణం కట్టుకున్నారు కె. అన్నామలై.
ఇందులో భాగంగా ఊహించని రీతిలో తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు శరత్ కుమార్ , భార్య ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీతో దోస్తీకి ఓకే చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ , పార్టీ చీఫ్ అన్నామలై తో కలిసి తాము ఏర్పాటు చేసిన పార్టీ ఆల్ ఇండియా సమత్తువ మక్కల్ కట్చిని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు శరత్ కుమార్.
ఈ సందర్బంగా సీనియర్ నటుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.