చెరువుల ఆక్రమణ రాములమ్మ ఆవేదన
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలి
హైదరాబాద్ – ప్రముఖ నటి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదే సమయంలో ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయో లెక్కలు తేల్చాలని కోరారు.
హైడ్రా దూకుడును అభినందించారు. ఎవరెవరు ఆక్రమణలకు పాల్పడ్డారో, భవనాలను నిర్మించారో వారి పూర్తి వివరాలను ప్రజలకు తెలియ చేయాలని అన్నారు. ఇక నుంచి ఇలాంటి ఆక్రమణలకు పాల్పడకుండా ఉండేందుకు భయపడతారని పేర్కొన్నారు విజయ శాంతి.
రోజు రోజుకు హైదరాబాద్ నగరాన్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నటి. గత రికార్డుల ప్రకారం దాదాపు 7,000 చెరువులు ఉన్నట్లు వెల్లడించారని, అవన్నీ కాన రాకుండా పోయాయని వాటిని తిరిగి గుర్తించాలని కోరారు విజయ శాంతి. లేక పోతే ఇలాగే అక్రమ కట్టడాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రకృతిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడినా వారి గురించి ప్రభుత్వానికి తెలియ చేయాలని సూచించారు నటి, సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయ శాంతి.