ఏపీ వరద బాధితులకు రూ. 25 కోట్ల విరాళం
చెక్కును అందించిన అదానీ ఫౌండేషన్
అమరావతి – ఏపీలో చోటు చేసుకున్న వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించింది అదానీ గ్రూప్ సంస్థకు చెందిన అదానీ ఫౌండేషన్. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ. 25 కోట్ల చెక్కును అందజేశారు. అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ అదానీ ప్రీతి తరపున ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
సీఎం సహాయ నిధికి ఉదారంగా సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు సీఎం. అదానీ గ్రూప్ చైర్మన్ కు, అదానీ ఫౌండేషన్ కు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.
అదానీ పోర్ట్స్, SEZ లిమిటెడ్ కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ వ్యక్తిగతంగా సాయానికి సంబంధించిన లేఖను అందించినందుకు అభినందించారు . ఇదే సమయంలో వినాశకరమైన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల జీవితాలను పునర్నిర్మించడంలో మీ సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతుగా సాయం ప్రకటించారు. పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. విద్యా రంగ సంస్థలు సైతం తమ తోడ్పాటు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సీఎం.