ఏపీలో భారీగా అదానీ గ్రూప్ పెట్టుబడులు
ఆనందం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తోంది. దీంతో పెట్టుబడిదారులు, దిగ్గజ కంపెనీలు ప్రస్తుతం ఏపీ వైపు చూస్తున్నాయి. ఈ తరుణంలో మరోసారి రాజధాని ఎక్కడనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన వచ్చాక పాలనా పరంగా పరుగులు పెట్టించడం మొదలు పెట్టారు. ప్రధానంగా ఐటీ, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్స్, మైన్స్, నేచురల్ గ్యాస్ , వ్యాపార, వాణిజ్యానికి సంబంధించిన రంగాలపై మరింత దృష్టి సారించారు.
ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎలాగైనా సరే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకు రావాలని, భారీ ఎత్తున కంపెనీలను ఏర్పాటు చేయించేలా చూడాలని నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది తెలుగుదేశం పార్టీ. దీంతో రెండు కీలకమైన పదవులు కూడా ఆ పార్టీకి దక్కాయి.
దీంతో ఏది కోరినా ప్రధానమంత్రి మోడీ ఇచ్చేందుకు ఓకే చెబుతున్నారు. ఈ తరుణంలో మోడీకి నమ్మకమైన స్నేహితుడిగా పేరు పొందిన అదానీ గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అదానీ గ్రూప్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ ఎండీ రాజేష్ అదానీ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రితో భేటీ అయ్యింది. ఈ సందర్బంగా విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.