అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా తనపై నమ్మకం ఉంచిన ఏఐసీసీ హై కమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తన జీవితం మొత్తం తెలంగాణకే అంకితం చేశానని అన్నారు. తనకు ఛాన్స్ రావడంతో చాలా మంది వాళ్ల ఇంట్లో బిడ్డకు వచ్చినట్లు ఆనంద పడుతున్నారని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి పార్టీ ఇచ్చిన అదనపు బాధ్యత ఇది అని, దానిని సమర్థవంతంగా నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నామినేషన్ దాఖలు చేశారు అద్దంకి దయాకర్. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒకవేళ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వక పోయినా కూడా ప్రజల కోసం ఇలానే పోరాడేవాడినని అన్నారు. ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. తన జీవితమంతా తెలంగాణ విముక్తి కోసం కృషి చేస్తూ వచ్చానని చెప్పారు .గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా తమ సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.