తిరుమలలో అదనపు ఈవో విస్తృత తనిఖీలు
సౌకర్యాలపై భక్తులకు అవగాహన కల్పన
తిరుమల – టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెల్లవారు జామున తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, కృష్ణతేజ సర్కిల్, నారాయణగిరి ఉద్యనవనాల్లోని షెడ్లు, క్యూ లైన్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై ఆయన భక్తులకు అవగాహన కల్పించారు. కంపార్ట్మెంట్లలో వడ్డించిన ఉప్మా చాలా రుచికరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తాగునీరు, అన్న ప్రసాదాలు, పాలు అందించే విధానాన్ని పరిశీలించి, కంపార్ట్మెంట్ల వెలుపల ఉన్న బోర్డులపై భక్తులకు అందించే ఆహార పానీయాలు, సమయాలను పేర్కొనాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కంపార్ట్మెంట్లను నిరంతరం పర్యవేక్షించి ఎక్కడా జాప్యం లేకుండా భక్తులను దర్శనానికి వదలాలన్నారు. వీ క్యూ సీ కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి పంపిన వెంటనే, మరింత మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కృష్ణ తేజ సర్కిల్ వద్ద భక్తులు క్యూ లైన్ ల లోకి ప్రవేశించే మార్గాల వద్ద కొందరు ప్రైవేటు టాక్సీ, జీప్ డ్రైవర్లు అడ్డంగా పార్కింగ్ చేయడాన్ని గమనించి, డ్రైవర్లను హెచ్చరించారు. భవిష్యత్తులో ఐటువంటి అనధికారిక పార్కింగ్ నివారించేందుకు, స్థానిక పోలీసులతో చర్చలు జరపాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
అదనపు ఈవో వెంట ఏఈవోలు గంగాధరం, మునిరత్నం, ఇతర అధికారులు ఉన్నారు.