ఆఫ్గన్ విజయం మిన్నంటిన సంబురం
టి20 వరల్డ్ కప్ సెమీస్ కు అనామక జట్టు
కింగ్ స్టన్ – ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో అమెరికా, విండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టి20 ప్రపంచ కప్ లో ఊహించని రీతిలో పిల్ల కూనలుగా భావించిన ఆఫ్గనిస్తాన్ జట్టు ఏకంగా సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఆ జట్టును అభేద్యమైన టీమ్ గా తీర్చి దిద్దడంలో కీలకమైన పాత్ర పోషించాడు భారత క్రికెట్ కు చెందిన మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.
తను క్రికెటర్లను పులుల్లా తయారు చేశాడు. ఇటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో కళ్లు చెదిరేలా ప్రత్యర్థులను ఎలా బోల్తా కొట్టించాలో చేసి చూపించాడు. తన కెరీర్ అర్ధాంతరంగా ఆగి పోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆఫ్గనిస్తాన్ జట్టుకు సేవలందించాడు.
కింగ్ స్టన్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ జట్టును 8 పరుగుల తేడాతో ఓడించింది సెమీస్ కు చేరుకుంది. ఈ సందర్బంగా ఆఫ్గనిస్తాన్ దేశంలో సంబురాలు మిన్నంటాయి. వేలాది మంది తరలి వచ్చారు. తమ జాతీయ పతాకాలతో ప్రదర్శన చేపట్టారు. ఈ ఫోటోలను ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.