అదానీతో ఒప్పందాలను రద్దు చేయలేం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్ – సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చావు కబురు చల్లగా చెప్పారు. ఓ వైపు రాహుల్ గాంధీ అదానీపై దుమ్మెత్తి పోస్తుంటే మరో వైపు అదానీతో సంబంధాలు తెంచుకోలేమని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం. అదానీ సమస్య మన చేతుల్లో లేదన్నారు.
గౌతమ్ అదానీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయలేమని బాంబు పేల్చారు. మొత్తంగా తాను అదానీతోనే ఉంటానని చెప్పకనే చెప్పారు. బీఆర్ఎస్ కేసీఆర్ సర్కార్ గౌతమ్ అదానీతో కొన్ని ఒప్పందాలు చేసుకుందని అన్నారు. ఈ ఒప్పందాలను సింగిల్ స్ట్రోక్ తో రద్దు చేసే పరిస్థితి ఉండదన్నారు.
తాను కూడా ఏమీ చేయలేనని పేర్కొన్నారు. ఇప్పటికే అదానీతో అంటకాగిన రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్శిటీకి రూ. 100 కోట్లు ఇచ్చిన వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. దీనిని తిరిగి వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చడంపై పలు అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. ఆయన వచ్చాక దేశంలో ప్రైవేట్ పెట్టుబడిదారులకు ప్రయారిటీ లభించిందని ఆరోపించారు.