ఢిల్లీలో మహిళలకు రక్షణ కరువు
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఇలా ఎంత కాలం భయంతో బతుకుతారని ప్రశ్నించారు. ప్రతి రోజూ నలుగురు రేప్ కు, 11 మందికి పైగా కిడ్నాప్ లకు గురవుతున్నారని వాపోయారు. ఒక ఏడాదిలో మహిళలపై కనీసం 1400లకు పైగా నేరాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.
ప్రస్తుతం రాజధానిలో ఇళ్లను వదిలి పెట్టి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. అసలు శాంతి భద్రతల అంశం ప్రస్తుతం కేంద్రం చేతిలో ఉందని అన్నారు. మోడీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నిద్ర పోతున్నారా అంటూ నిలదీశారు ఖర్గే. ఢిల్లీలో శాంతి భద్రతల పరిరక్షణలో బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం విఫలమైందనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మల్లికార్జున్ ఖర్గే.
ఢిల్లీ మహిళలు బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్.