ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. అర్ధరాత్రి హడావుడిగా కొత్త కేంద్ర ఎన్నికల కమిషనర్ ను నియమించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా ఉండాలంటే ఎన్నికల కమిషన్ నిష్పాక్షికమైన పాత్ర పోషించేలా ఉండాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు. CECని ఎన్నుకునే ముందు 19వ తేదీ వరకు వేచి ఉండాలన్నారు. హడావుడిగా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవడంపై మండిపడ్డారు.
కొత్త సీఈసీని నియమించాలన్న వారి నిర్ణయాన్ని పూర్తిగా పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమన్నారు.
దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి దక్కుతుందన్నారు. కేవలం పెట్టుబడిదారులకు మేలు చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సర్కార్ కు ఝలక్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారంటూ ప్రకటించారు.