ఆఫ్గనిస్తాన్ సక్సెస్ వెనుక మనోడు
జట్టును తీర్చి దిద్దడంలో జడేజా
హైదరాబాద్ – గత కొంత కాలం నుంచీ ఎవరూ ఊహించని రీతిలో పిల్ల కూనలుగా నిన్నటి దాకా అభివర్ణిస్తూ వచ్చిన ఆఫ్గనిస్తాన్ క్రికెట్ టీం ఇప్పుడు బలమైన జట్టుగా ఎదిగింది. అంతే కాదు ప్రత్యర్థులు ఎవరైనా సరే చుక్కలు చూపిస్తోంది. అద్భుత విజయాలు నమోదు చేస్తూ విస్తు పోయేలా చేస్తోంది.
కీలకమైన మ్యాచ్ లలో అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దుమ్ము రేపుతోంది. తాజాగా ఐసీసీ నిర్వహిస్తున్న టి20 టోర్నీలో ఏకంగా సెమీ ఫైనల్ కు చేరుకుంది ఆఫ్గనిస్తాన్ జట్టు. ఆస్ట్రేలియా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇప్పటికే పాకిస్తాన్ టోర్నీ నుంచి నిరాశ జనకమైన ప్రదర్శనతో చాప చుట్టేసింది. నిత్యం తుపాకుల మోతతో దద్దరిల్లే ఆఫ్గనిస్తాన్ లో క్రికెటర్లు ఇప్పుడు ఆశాజనకంగా మారారు. ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నారు.
ఇక అప్రతిహతంగా వరుస విజయాలతో దూసుకు పోతున్న ఆఫ్గనిస్తాన్ జట్టు వెనుక ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడు ఎవరో కాదు భారత క్రికెట్ కు చెందిన మాజీ క్రికెటర్ అజయ్ జడేజా. తను మెంటార్ గా , హెడ్ కోచ్ గా ఉన్నాడు. జట్టును ప్రపంచ జట్లతో తలపడేలా తీర్చి దిద్దడంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఇప్పుడంతా ఆ జట్టు వెనుక ఎవరు ఉన్నది అంటూ ఆరా తీస్తున్నారు.